సమాచార శాఖలో ఆంజనేయులు సేవలు మరువలేనివి

సమాచార శాఖలో ఆంజనేయులు సేవలు మరువలేనివి
నంద్యాల బ్యూరో ఆగస్టు 31 యువతరం న్యూస్:
సమాచార శాఖలో 32 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఫోటోగ్రాఫర్ కె.ఆంజనేయులు వారి సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ లు పేర్కొన్నారు.
శనివారం కలెక్టరేట్లోని సమాచార పౌర సంబంధాల శాఖలో పబ్లిసిటీ అసిస్టెంట్ (ఫోటోగ్రాఫర్) పదవీ విరమణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, సమాచార శాఖ డిఐపిఆర్ఓ, వారి సిబ్బంది పాల్గొని విధి నిర్వహణలో ఆంజనేయులు అందజేసిన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సమాచార శాఖలో ఎంతో బాధ్యతగా, నిబద్దతతో విధులు నిర్వహించి, జిల్లాకు వచ్చే ప్రముఖులు, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు విధిగా ఫోటో కవరేజ్ చేసి సక్రమంగా విధులు నిర్వహించడం అభినందనీయం అని పేర్కొన్నారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరే సమయంలో చాలా మంది ఎంతో ఉత్సాహంతో చేరుతారని కానీ పదవీ విరమణ సమయంలో నిస్పృహలకు గురిఅవుతారని.. అలాకాకుండా విధుల నిర్వహణలో చివరి రోజు వరకు సక్రమంగా విధులు నిర్వహించడంతో పాటు జిల్లా ఉన్నతాధికారుల మన్నలను పొందడం జరిగిందన్నారు.
సమాచార శాఖ డిఐపిఆర్ఓ సిహెచ్.పురుషోత్తం మాట్లాడుతూ….సమాచార శాఖలో పబ్లిసిటీ అసిస్టెంట్ (ఫోటోగ్రాఫర్)గా 32 సంవత్సరాల పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంతో మంది ప్రముఖులు జిల్లా పర్యటనకు విచ్చేసిన సమయంలో ఎటువంటి ఒత్తిడి గురికాకుండా చాకచక్యంగా ప్రముఖుల ఫోటోలు తీసి శాఖకు గుర్తింపు తెచ్చేలా కృషి చేయడం జరిగిందన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు గానీ బాధ్యతాయుతంగా, సమయస్ఫూర్తితో ఫోటో కవరేజ్ చేసి శాఖ విస్తృత సేవలు అందజేయడం జరిగిందన్నారు.
అనంతరం జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్ వారు ఆంజనేయులు దంపతులకు పట్టు వస్త్రాలు, నంద్యాల జిల్లా ప్రతీకగా నిలిచే నంది విగ్రహాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు. అలాగే సమాచార శాఖ డిఐపిఆర్ఓ సిబ్బంది ఆంజనేయులు దంపతులకు ఆత్మీయ సత్కారం చేశారు.
కార్యక్రమంలో డిఆర్ఓ రాము నాయక్, కలెక్టరేట్ పరిపాలనాధికారి, రెవెన్యూ శాఖ, సమాచార శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.