నిరాదరణకు గురైన మన్యం వీరుడు
చింతపల్లిలో అల్లూరి విగ్రహం దుస్థితి

నిరాదరణకు గురైన మన్యం వీరుడు
చింతపల్లిలో అల్లూరి విగ్రహం దుస్థితి
చింతపల్లి ఆగస్టు 25 యువతరం న్యూస్:
మన దేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు అల్లూరి సీతారామరాజు. మన్యం ప్రాంత ఆదివాసీలను ఒక్కటి చేసి, బ్రిటిష్ వారిపై వీరోచిత పోరాటం చేసిన ఆయన త్యాగం, తెగువ అపారమైనవి. అల్లూరి నడయాడిన ప్రాంతంలోనే, ఆయన విగ్రహానికి నేడు జరుగుతున్న అవమానం అందరినీ కలచివేస్తోంది. అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం ముఖ ద్వారమైన చింతపల్లిలో ఉన్న హనుమాన్ కూడలి వద్ద అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే, జాతీయ రహదారి నిర్మాణ పనుల కారణంగా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. కానీ, ఆ తర్వాత ఆ విగ్రహానికి ఇవ్వాల్సిన గౌరవం, భద్రత కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. నేడు ఆ విగ్రహం చింతపల్లిలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో ఏ మాత్రం భద్రత లేకుండా, మూలన పడి ఉంది. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఆదివాసీలలో పోరాడే స్ఫూర్తిని రగిలించి, ఎంతోమందిని ఉత్తేజపరిచిన ఆ మహనీయుడి విగ్రహానికి జరుగుతున్న ఈ నిర్లక్ష్యం ఈ ప్రాంత ప్రజలను, అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఇది కేవలం ఒక విగ్రహానికి జరిగిన అవమానం మాత్రమే కాదు, దేశం కోసం అసువులు బాసిన ఒక వీరుడి త్యాగాన్ని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో చెప్పే నిలువెత్తు నిదర్శనం. జిల్లాకు అల్లూరి పేరు పెట్టిన ప్రభుత్వం, ఆయన త్యాగాలకు గౌరవం చూపించే బాధ్యతను నిర్వర్తించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన హక్కులు, జీవన విధానాల కోసం తన యవ్వనాన్ని త్యాగం చేసిన మహానాయకుడి విగ్రహం ఇలా నిర్లక్ష్యంగా మూలన చేరడం బాధాకరం. జయంతి, వర్ధంతి రోజుల్లో మాత్రమే అధికారులు, రాజకీయ నాయకులకు గుర్తుకు వస్తారా..? ఆరోజునే పూలమాలలు, నివాళులు అర్పిస్తారా…? మిగతా రోజుల్లో ఆయన గౌరవం అవసరం లేదా…? అంటూ గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. విగ్రహాన్ని గౌరవప్రదంగా పునఃప్రతిష్ట చేసి, చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేసి, దీపాలంకరణ చేసి, శిలాఫలకం అమర్చాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని వెంటనే గుర్తించి, అల్లూరి విగ్రహాన్ని తిరిగి సముచిత స్థానంలో ప్రతిష్టించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు మనం ఇవ్వాల్సిన నిజమైన నివాళి, ఆయన ఆశయాలను గౌరవించడం, ఆయన వారసత్వాన్ని కాపాడటం. మరి ఈ నిర్లక్ష్యం ఎప్పటికి ముగుస్తుందో చూడాలి.