సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న యాంకర్ అనసూయ దంపతులు

సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న యాంకర్ అనసూయ దంపతులు
ఉత్తరాంధ్ర ప్రతినిధి
ఆగస్టు 23 యువతరం న్యూస్:
ప్రముఖ టీవీ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తన భర్త, పిల్లలతో కలిసి శనివారం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన అనసూయ దంపతులకు దేవస్థాన అధికారులు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు.
ముందుగా వారు పవిత్రమైన కప్పస్తంభంను ఆలింగనం చేసుకుని, అనంతరం స్వామివారి మూలవిరాట్టును దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేదపండితులు దంపతులకు వేదాశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు అనసూయతో మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తున్నందుకు ఆమెను అభినందించారు. మన సంస్కృతి సంప్రదాయాలను తరతరాలకు చేరవేయడంలో ఇలాంటి సందర్శనలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు.
మీడియాతో మాట్లాడిన అనసూయ, “సింహాచలంలో స్వామివారిని దర్శించుకోవడం నిజంగా అద్భుతమైన అనుభూతి. ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో స్వామివారి ఆశీస్సులు పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని పేర్కొన్నారు.
ఆధ్యాత్మికత, భక్తి, ఆనందం నిండిన ఈ యాత్ర తన జీవితంలో మరపురాని క్షణమని అనసూయ అన్నారు.