వెల్దుర్తి జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ ఆవరణ ఆక్రమణదారులకు నోటీసులు జారీ
వెల్దుర్తి లో ట్రాఫిక్ సమస్య కారణంగా ఎక్స్ప్రెస్ బస్సులు హైవేలో వెళుతున్నాయి

వెల్దుర్తి జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ ఆవరణ ఆక్రమణదారులకు నోటీసులు జారీ
వెల్దుర్తి ఆగస్టు 18 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి లోని జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ ఆవరణకు అనుకొని ఉన్న 30 శాపులకు సంబంధించి 15 మంది యజమానులకు నోటీసులు మేజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీ నాథ్ సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్దుర్తి జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ కు సంబంధించి సర్వేనెంబర్ 259 మరియు సర్వేనెంబర్ 249లలో కొన్ని సెంట్ల భూమిని కొందరు ఆక్రమించుకున్నట్లు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు అందాయని తెలిపారు. దీంతో జిల్లా పరిషత్ సీఈఓ ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించాలని ఆక్రమణదారులకు నోటీసులు అందజేయడం జరిగిందన్నారు. కాగా ఈ సంఘటనపై మండల ప్రజలు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ ఆక్రమణలు తొలగిస్తారా లేక ఏదైనా రాజకీయం చేస్తారా అంటూ మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో వెల్దుర్తిలో రోడ్ల వెడల్పు కోసం అధికారులు ప్రయత్నం చేయగా కొన్ని రాజకీయ శక్తులు అడ్డుకున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా చాలా సంవత్సరాలుగా వెల్దుర్తిలో రోడ్లు వెడల్పు చేయాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు. ముఖ్యంగా రోడ్లు ఆక్రమణల కారణంగా వెల్దుర్తిలో ట్రాఫిక్ సమస్య వల్ల ఎక్స్ప్రెస్ బస్సులు వెల్దుర్తిలోనికి రాకుండా హైవేలో పంపిస్తున్నట్లు డోన్ ఆర్టీసీ అధికారులు వెల్దుర్తి మండల సర్వసభ్య సమావేశంలో పేర్కొనడం గమనించదగ్గ విషయం. ఒకవేళ హై స్కూల్ ఆవరణలోని ఆక్రమణలు తొలగిస్తే డోన్ వైపు గేట్ నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు రోడ్లు ఇరువైపులా మరియు రామళ్లకోట రోడ్డు బ్రిడ్జి నుండి రైల్వే స్టేషన్ వరకు గల ఆక్రమణల పరిస్థితి ఏమిటి అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా మండల కేంద్రమైన వెల్దుర్తిలో ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి అన్నది నేటి పాలకులకు మరియు అధికారులకు తెలిసిందే. ఎదురెదురుగా ఒక లారీ గాని బస్సు గాని వస్తే ద్విచక్ర వాహనం వెళ్లలేని దుస్థితి నేడు నెలకొంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్ రోడ్డులో అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ వెళ్లలేని దుస్థితి నేడు నెలకొంది. ఏళ్ల తరబడి పాలకులు మరియు అధికారులు మారుతున్న వెల్దుర్తి ట్రాఫిక్ సమస్య మారడం లేదని మండల ప్రజలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పాత బస్టాండ్ లో ఆక్రమిత షాపుల ముందు బస్సుల కోసం ప్రయాణికులు నిలబడవలసిన స్థితి నెలకొంది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు సైతం నిలబడవలసిందే. ఆక్రమణల తొలగింపు వెల్దుర్తిలో చేస్తే ట్రాఫిక్ సమస్య చాలావరకు తగ్గిపోతుంది అని వాహనదారులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఆక్రమణలు తొలగిస్తారా లేక రాజకీయానికి తలవంచుతారా అన్నది వేచి చూడవలసిందే. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ చిన్న పాల్గొన్నారు.