సాంప్రదాయబద్ధంగా పండగలు నిర్వహించుకోవాలి
డీజే లకు అనుమతులు లేవు

సాంప్రదాయబద్ధంగా పండగలు నిర్వహించుకోవాలి
సిఐ మధుసూదన్ రావు,
ఎస్సై అశోక్
వెల్దుర్తి ఆగస్టు 18 యువతరం న్యూస్:
పండుగలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూధన్ రావు, ఎస్సై అశోక్ పేర్కొన్నారు. స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఆవరణంలో వినాయక ఉత్సవ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలకు డిజే అనుమతులు లేవన్నారు. వినాయక విగ్రహాల వద్ద పూజలను సాంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. అంతేగాని ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా అర్థనగ్నంగా డాన్సులు వేస్తూ, భక్తి పాటలు కాకుండా డిస్కో పాటలు పెట్టుకోవడం మానుకోవాలని హితవు పలికారు. అంతేకాకుండా విగ్రహాల వద్ద తాగి గొడవలకి దిగితే పోలీసు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. నిమజ్జన సమయంలో చిన్న పిల్లలపై నిర్వాహకులు ప్రత్యేక దృష్టి ఉంచుకోవాలన్నారు. పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని పండగ సందర్భంగా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అన్నారు. అంతేకాకుండా విగ్రహాలను ఊర్లో మొత్తం తిప్పకుండా పాత బస్టాండు తెలుగు తల్లి విగ్రహం వద్ద తిరిగి వెళ్లాలని పేర్కొన్నారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడాలని ఆలోచన వచ్చిన వారికి చుక్కలు చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్సై విద్య శ్రీ పాల్గొన్నారు.