రూ.13 లక్షలతో బిసి సంక్షేమ బాలికల వసతి గృహంలో నూతనంగా నిర్మించిన 6 టాయిలెట్లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

రూ.13 లక్షలతో బిసి సంక్షేమ బాలికల వసతి గృహంలో నూతనంగా నిర్మించిన 6 టాయిలెట్లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల ప్రతినిధి ఆగస్టు 6 యువతరం న్యూస్:
నంద్యాల పట్టణం ఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న బీసీ సంక్షేమ బాలికల వసతి గృహంలో సిఎస్ఆర్ నిధులు రూ.13 లక్షల ఖర్చుతో నూతనంగా నిర్మించిన ఆరు టాయిలెట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ప్రారంభించారు.
పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో దాదాపు 250మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. సదరు వసతి గృహంలో బాలికా విద్యార్థులకు సరిపడా టాయిలెట్లు లేనందున ఇబ్బంది పడుతున్న విషయం కలెక్టర్ దృష్టికి వచ్చింది. ఇందుకు సంబంధించి సిఎస్ఆర్ లో భాగంగా వసతి గృహంలో అదనంగా టాయిలెట్ వసతి కలిగిన బాత్రూంలు నిర్మించాలని రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ వారికి కలెక్టరు సూచించారు. ఈ మేరకు నూతనంగా నిర్మించిన 6 టాయిలెట్ బ్లాక్ లను కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన టాయిలెట్లను కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ… వసతి గృహాలలోని విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. వసతి గృహంలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు అందరూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకోవాలి. ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలను చేరుకోవాలన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహంలో సరిపడ టాయిలెట్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయం దృష్టికి వచ్చిన పిదప రాయలసీమ ఎక్స్ప్రెస్ వే వారిని సి ఎస్ ఆర్ లో భాగంగా టాయిలెట్లు నిర్మించాలని కోరడం జరిగిందన్నారు. ఈ మేరకు వారు బాధ్యతగా త్వరితగతిన టాయిలెట్లను నిర్మించి ప్రారంభింప చేయడం సంతోషించదగిన విషయమని.. ఇందుకు వారిని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి జగ్గయ్య, రాయలసీమ ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్ హెడ్ మదన్మోహన్ వంగర, వారి సిబ్బంది, వసతి గృహం విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.