బాధ్యతాయుతంగా అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలి
బాధ్యతాయుతంగా అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలి
జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్
నంద్యాల బ్యూరో ఆగస్టు 5 యువతరం న్యూస్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పిజిఆర్ఎస్ కార్యక్రమంలో అందిన దరఖాస్తులను బాధ్యతాయుతంగా.. అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు.
నంద్యాల కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశపు హాలులో… సోమవారం జేసీ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం- పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ… ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారునికి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. పెండింగ్, బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలన్నారు.
అనంతరం డిఆర్ఓ రాము నాయక్ తో కలిసి జేసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఇందులో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు భూ సమస్యల పరిష్కారం రేషన్ కార్డులు ఇంటి పట్టాల మంజూరు పెన్షన్ మంజూరు తదితర సమస్యలపై దాదాపు 289 విన్నతులను సమర్పించారు. వీటన్నిటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జెసి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.



