విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ని సందర్శించిన 28 మంది ట్రెయినీ ఐపీఎస్ అధికారుల బృందం

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ని సందర్శించిన 28 మంది ట్రెయినీ ఐపీఎస్ అధికారుల బృందం
ఉత్తరాంధ్ర ప్రతినిధి జూలై 24 యువతరం న్యూస్:
వివిధ రాష్ట్రాలకు చెందిన 28 మంది ట్రెయినీ ఐపీఎస్ అధికారుల బృందం బుధవారం విశాఖపట్నం పోర్ట్ అథారిటీని సందర్శించారు. సముద్ర భద్రతలో ఎదురయ్యే ఆధునిక సవాళ్లు గురించి అవగాహన పొందే ఉద్దేశంతో వారు విశాఖపట్నం పోర్ట్ ను సందర్శించారు. సముద్ర భద్రతకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం శిక్షణలో ఉన్న అధికారులకు ఈ తరహా సందర్శనలను నిర్వహిస్తోంది.
విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అధికారులు, శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారులకు సాదర స్వాగతం పలికారు. పోర్ట్‌లో జరుగుతున్న వివిధ కార్యకలాపాలు, అభివృద్ధి పనులను గురించి పోర్ట్ అధికారులు సవివరంగా వివరించారు. పోర్ట్ డిప్యూటీ కన్జర్వేటర్, పోర్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ ఆఫీసర్ (పి ఎఫ్ ఎస్ ఓ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) అధికారులు ట్రెయినీ అధికారులకు పోర్ట్ భద్రతకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించారు.
పోర్ట్‌లోని మౌలిక సదుపాయాలు, కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం, ఆధునీకరణ యాంత్రీకరణ, కవర్డ్ గోదాములు, సోలార్ పవర్ ఉత్పత్తి, పరిశ్రమల కోసం ఎస్ టి పి నీటి పునర్వినియోగం, పెట్టుబడుల అవకాశాలు ఎగుమతులు దిగుమతులు వంటి అంశాలను పోర్ట్ అధికారులు శిక్షణలో ఉన్న ట్రైనీ అధికారులకు వివరించారు.
పోర్ట్ అధికారులు ఇచ్చిన ఆతిథ్యం పట్ల శిక్షణలో ఉన్న ట్రైనర్ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. పోర్ట్ కార్యకలాపాలపై పూర్తి అవగాహన కల్పించే విధంగా అధికారులు ఇచ్చిన సమాచారం పై ట్రైనీ ఐపీఎస్ లు పోర్ట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.