తరతరాల సంప్రదాయం.. బండిశూల ఉత్సవం..

తరతరాల సంప్రదాయం.. బండిశూల ఉత్సవం..
ఏడు కాండ్ల(14ఎద్దులు)తో రథోత్సవం
రథోత్సవం కోసమే ఎద్దులు కొనుగోలు
ఐదు రోజుల పాటు సాగే ఉత్సవాలు
ఈ నెల 7 నుంచి బండిశూల ఉత్సవాలు
బందోబస్తు నడుమ ఉత్సవాలు
పామిడి, మే 5 యువతరం న్యూస్:
బండిశూల(శూరబండి) ఉత్సవం తరతరాల సంప్రదాయంకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ ఉత్సవానికి జిల్లాలో ఎంతో ప్రత్యేకత ఉంది. మూడు గ్రామాలు కేంద్రంగా ఏడు కాండ్ల ఎద్దులతో ఐదు రోజులపాటు సాగే వైభోగమిది. ఇది పండితులు సెలవిచ్చిన ఉత్సవం కాదు. ప్రజలు ఆరంభించినది అంతకన్నా కాదు. స్వయానా దేవతలే చేయించుకుంటున్న మహోత్సవం. ఈ మహోత్సవం పామిడి మండలంలోని రామరాజుపల్లి, పెద్దవడుగూరు మండలంలోని కాశేపల్లి, గుత్తి అనంతపురము గ్రామాల నడుమ ఎంతో వైభవంగా జరుగుతుంది. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో ఈ వేడుకలు జరుగుతాయి. జిల్లాలోని పలు మండలాల నుండే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరతరాల సంప్రదాయంగా ఈ బండిశూల ఉత్సవాలను జరుపుకోవడం విశేషం.
ఉత్సవ విశిష్టత ఇది :
ఐదు రోజులు పాటు జరుపుకునే ఈ ఉత్సవాలు పై రామరాజుపల్లి ప్రజలు తెలిపే చరిత్ర వింటే ఆశ్చర్యం కలగక మానదు. పూర్వం రామరాజుపల్లికి చెందిన రజకులు గుత్తి-అనంతపురము వాగుకు వెళ్లి బట్టలు ఉతుకుతూ జీవనం కొనసాగించేవారు. ఒక రోజు గ్రామానికి చెందిన ఓ రజకుడు వాగుకు బట్టలు ఉతికేందుకు వెళితే నీళ్లు కన్పించలేదు. ఆ రజకుడు నీరు లేదని వెనుదిరిగి వస్తుండగా రెండు గాడిదలపై ఇద్దరు చిన్నారులు కూర్చోవడం గమనించాడు. ఆ చిన్నారులను ఎంత పలకరించినా పలుకలేదట, దీంతో ఆ రజకుడు వారి చేతులు పట్టుకోగా.. వారు అదృశ్యమయ్యారు. ఇలా ఈ తంతు వారం రోజుల పాటు సాగింది. ఆ చిన్నారులు గ్రామంలోని చిన్నారులతో గోళీలాట ఆడుతూ అందరినీ ఓడించి ఆట పట్టించేవారు. ఈ విషయాన్ని ఆ రజకుడు, పిల్లలు గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామ ప్రజలు భూత, ప్రేత, పిశాచ, దయ్యాలేమోనని తేల్చుకుందామని రజకుని వెంటవెళ్లారు. గ్రామ ప్రజలకు కూడా గాడిదలపై వచ్చినట్లుగా బాలలు దర్శనమిచ్చారు.
ప్రజలు వారిని నిలదీయడంతో మేము అక్కా తమ్ముడైన సుంకులమ్మ, ముత్యాలయ్య అను దేవతలము. మా పేరున వైశాఖ మాసం పౌర్ణమికి ఐదు రోజులు తిరునాళ జరపాలని సూచించారట. ఆ గ్రామ దేవతలు ఏడు కాండ్ల(14ఎద్దులు)తో రథాన్ని లాగించాలని తెలిపారట. ఉత్సవానికి బండిలేదని ప్రజలు తెలియజేయడంతో ఆ బాల రూప దేవతలు మద్దికెర గ్రామం రజక గురప్ప ఇంటి వద్ద గల బండిని తీసుకురమ్మని ఆజ్ఞాపించారట. ప్రజలు గురప్ప ఇంటికి వెళ్లి బండి కావాలని కోరారట. గుర్రప్ప ఆ బండిని ఇవ్వడానికి తిరస్కరించి, దేవతలను తూలనాడడంతో వారు జరిగిన విషయాన్ని ఆ బాల దేవతలకు తెలియజేశారట. ఆ దేవతలు బండారు(కుంకుమ, పసుపుల మిశ్రమం)ను గ్రామ ప్రజలకు ఇచ్చి పంపారట. బాట దేవతలు చెప్పినట్లు ఇవ్వని పక్షంలో నీ సంసారం కూలుతుందని తెలియజేసినా గుర్రప్ప తిరస్కరించడంతో వెనుదిరిగారట. వారం రోజుల్లో గుర్రప్ప, ఆయన భార్య, కుమారులు మరణించడంతో గుర్రప్ప తల్లి ఆ బండిని రామరాజుపల్లి గ్రామ ప్రజలకు అప్పగించిందట. మద్దికెర నుంచి తెచ్చిన బండిలో చింతలచెరువు గ్రామం హంపమ్మ ఇంటి నుంచి తాటిమానును తీసుకొని వచ్చి సుడిబండి తయారు చేశారు. సుడిబండికి ఉన్న తాటిమానుకు వ్రేళాడితే ఎలాంటి రోగమైనా నయమవు తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆనాటి నుంచి అంటువ్యాధులు గ్రామ దేవతల చలవతో గ్రామానికి సోకలేదని వారి నమ్మకం. సుడిబండికి నేతిగారెలు, నిమ్మకాయల హారాలు, పుష్పహారాలు వ్రేలాడదీస్తారు. ఆ గ్రామ దేవతలకు రామరాజుపల్లిలో ఇళ్లే ఆలయంకాగా, గుత్తి-అనంతపురములో ఆలయం నిర్మించారు. స్వామి వార్లను చిలకమ్మ పల్లకిలో ఊరేగిస్తూ వెళుతుంటే ఏడు కాండ్ల ఎద్దులు వంతుల వారీగా బండిశూలని లాగుతాయి. ఈ రథం మూడు గ్రామాల పొలాల మీదుగా వెళ్తుంది. రథోత్సవంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా రథోత్సవంను మాత్రం ఆపకుండా లాగించడం విశేషం. ఏయే పొలంలో వెళితే ఆయా పొలాల్లో పంటలు బాగా పండుతాయని రైతులు విశ్వసిస్తారు. ఈ రథోత్సవ వేడుకలను తిలకించిన ప్రజలు మాటల్లో చెప్పలేనంత అనుభూతిని పొందుతారనడం అతిశయోక్తికాదు. ఇలా ఎన్నో ఏళ్లుగా బండిశూల తిరునాళ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఆ గ్రామాలలో దేవుళ్ల పేర్లే :
రామరాజుపల్లి, కాశేపల్లి, గుత్తి అనంతపురము గ్రామాలలో ప్రతి ఇంటిలోనూ సుంకులమ్మ, ముత్యాలయ్య పేర్లు కలిసేలా కుటుంబ సభ్యుల పేర్లు ఉండడం విశేషం. ప్రతి ఇంటిలోనూ స్వామి వారి పేర్లు మీద ఇద్దరు, ముగ్గురు ఉంటారు. గ్రామాల్లో ఒకే పేరు గల వ్యక్తులు పదుల సంఖ్యలో ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొత్త వ్యక్తులు వ్యక్తి పేరుతో పాటు వారి ఇంటి పేరు చెబితేనే చిరునామా తెలుస్తుంది.
ఈ నెల 7 నుంచి 11 వరకూ బండిశూల ఉత్సవాలు :
ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకూ బండిశూల ఉత్సవాలు నిర్వహించనున్నట్లు రామరాజుపల్లి ప్రజలు పేర్కొన్నారు. మొదటి రోజు 7న స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గంగాభవాని పూజ, సుంకులమ్మ, ముత్యాలయ్య స్వామి వార్ల ఊరేగింపు, జలధి బావి వద్ద జలపూజ, నైవేద్య కార్యక్రమం చేపడతారు. అనంతరం స్వామి వారిని హంసవాహనంపై ఊరేగింపుగా రథము వద్దకు వచ్చును. సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక పూజానంతరం రథమునకు ఏడు కాండ్లు ఎద్దులు కట్టి రథోత్సవం ప్రారంభిస్తారు. రామరాజుపల్లి నుంచి గుత్తి-అనంతపు రము వనం(వాగు) వద్ద గల దేవాలయంకు రథోత్సవం వెళ్తుందన్నారు. 8న సాయంత్రం గుత్తి-అనంతపురం వనం వద్ద దేవాలయం నుంచి రామరాజుపల్లికి రధోత్సవం ప్రారంభిస్తారు. 9న రామరాజుపల్లి నుంచి మరోసారి గుత్తి-అనంతపురములోని వనం వద్ద గల గుడికి రథం చేరుతుందన్నారు. 10న గుత్తి-అనంతపురము వనం వద్ద తిరునాళ(పరుస) జరుగుతుంది. సాయంత్రం బోణాలతో నైవేద్యం సమర్పించిన తర్వాత రథం రామరాజుపల్లికి బయలుదేరుతుంది. రాత్రికి రామరాజుపల్లి గ్రామానికి చేరుకుంటుంది. ఏయే గ్రామ పొలిమేరల వరకూ ఆయా గ్రామాల ఎద్దులు రథాన్ని లాగుతాయన్నారు. 11న స్వామి వారికి కేశఖండనలు, మొక్కు బడులు తీర్చుకుంటారన్నారు.
బండిశూల రథోత్సవం కోసం ఎద్దుల కొనుగోలు :
చుట్టుపక్కల గల గ్రామాల రైతులు బండిశూల రథోత్సవం కోసం ఎద్దులను సైతం కొనుగోలు చేస్తారు. లక్షలాది రూపాయలుతో ఎద్దులు కొని వాటికి ముస్తాబు చేసి ఈ రథం(బండిశూల) లాగిస్తారు. కొందరు రైతులు మొక్కుబడి అని తెలియజేస్తు న్నారు. రథోత్సవంకు కొనుగోలు చేసిన ఎద్దులతో తమ పొలాల్లో వేసవి దుక్కులు చేసుకొని తిరిగి ఆ ఎద్దులను విక్రయిస్తుంటారు. ఈ క్రయ విక్రయాల్లో నష్టం వచ్చినా ఏ మాత్రం బాధపడకపోవడం విశేషం. ఏడాది పాటు రథోత్సవంలో తమ ఎద్దులు ఎలా లాగాయో ఇతరులకు చెప్పుకుంటూ మురిసిపోతుంటారు.
బందోబస్తు నడుమ బండిశూల ఉత్సవం :
పోలీసులు, రెవెన్యూ, విద్యుత్శాఖ అధికారులు గట్టి బందోబస్తు నడుమ ఈ బండి శూల ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. 2014 మే 9న ఈ రథోత్సవంలో భాగంగానే 132 కేవీ విద్యుత్ తీగలకు రథం తాక డంతో పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో 20 మంది గాయాలపాలయ్యారు. గతేడాది ఎన్నికల నేపథ్యంలో ఉత్సవాలు జరుగలేదు. దీంతో ఈ ఏడాది మరింత ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉం డడంతో పోలీసుల గట్టి బందోబస్తుతో ఉత్సవ వేడుకలు ఎంతో శాంతియుతంగా, ప్రశాతంగా జరిగేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఉత్సవాలు ప్రశాంతంగా భక్తులు, ప్రజలు సంతోషదాయకంగా జరుపుకోవాలని సీఐ యుగంధ ర్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ ఉత్సవాలలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని సలహాలు, సూచనలు తెలియజేస్తున్నారు.
ప్రశాంతంగా ఉత్సవాన్ని జరుపుకోండి :
– యుగంధర్, సీఐ, పామిడి.
తరతరాల నుంచి సంప్రదాయంగా చేస్తున్న బండిశూల ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోండి. ఈ ఉత్సవాలకు పెద్దఎత్తున భక్తులు తరలివస్తారు. గ్రామాల్లో మద్యం విక్రయాలు అరికట్టాలి. రాత్రి వేళల్లో రథోత్సవం జరుగుతున్నందున ఫోకస్ లైట్లతో వెలుగు సౌకర్యం కల్పించుకోవాలి. అనుమతించిన వారు మాత్రమే రథం నడిపేందుకు వెళ్లాలి. శాంతియుతంగా ఉత్సవ వేడుకలు జరిపేందుకు భక్తులు, ప్రజలు సహకరించాలి.