ANDHRA PRADESHBREAKING NEWSDEVOTIONALWORLD

ఏప్రిల్ 5న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్పణ

ఏప్రిల్ 5న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్పణ

బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

ఏప్రిల్ 6న ధ్వ‌జారోహ‌ణం

ఏప్రిల్ 6, 7వ తేదీల‌లో కవి సమ్మేళనం

ఒంటిమిట్ట ఏప్రిల్ 04 యువతరం న్యూస్:

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి శ్రీరామనవమి బ్ర‌హ్మోత్స‌వాలు ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. ఏప్రిల్ 5న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించ‌నున్నారు.శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు, ఎండవేడిని తట్టుకునేలా చలువపందిళ్లు ఏర్పాటుచేశారు. ఆలయ పరిసరాల్లో బారీకేడ్లు ఏర్పాటుచేశారు. ఆలయ గోపురాలు, కల్యాణవేదిక, ఇతర ప్రాంతాల్లో పుష్పాలంకరణలు, రంగురంగుల విద్యుత్‌ దీపాలు, విద్యుత్‌ కటౌట్లతో శోభాయమానంగా అలంకరించారు. భక్తుల కోసం అన్నప్రసాద వితరణ కౌంటర్లు తదితర ఏర్పాట్లు చేశారు.

ఏప్రిల్ 6న ధ్వ‌జారోహ‌ణము:-

ఏప్రిల్ 6న ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు శేష వాహనసేవ జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6న శ్రీ రామనవమి, ఏప్రిల్ 9న హనుమత్సేవ, ఏప్రిల్ 10న గరుడసేవ జరగనున్నాయి. ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వ‌ర‌కు శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరుగనుంది. అనంతరం గజ వాహనసేవ నిర్వహిస్తారు. ఏప్రిల్ 12న రథోత్సవం నిర్వహిస్తారు. ఏప్రిల్ 14న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఏప్రిల్ 15న సాయంత్రం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

కవి సమ్మేళనం:

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం, శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీ సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంటల వరకు పోతన భాగవతం అంశంపై కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7వ తేదీ రామ‌యాణంలోని కాండ‌లపై కవి సమ్మేళనం
జరుగుతుంది.

ఆలయ చరిత్ర:

ఈ ఆలయానికి పురాతన, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఒకే శిలపై సీతారామ లక్ష్మణ దేవతామూర్తులు ఉండడం వల్ల ఒంటిమిట్టను ఏకశిలానగరం అని కూడా అంటారు.పురాణాల ప్రకారం ఆలయ చరిత్ర ఇలా ఉంది. శ్రీమహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా అవతరించాడు. సీతాలక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో సంచరిస్తుండగా సీతాదేవి దప్పిక తీర్చేందుకు భూమిలోనికి బాణం వేయగా నీరు బుగ్గ పుట్టింది. అదే ఒంటిమిట్ట రామతీర్థం అయింది. సీతాన్వేషణ కోసం జాంబవంతుడు సహకరించాడు. ఆ జాంబవంతుడు సేవించిన సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడే ఒంటిమిట్ట గుడిలో కొలువై ఉన్నాడు.శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని మూడు దశల్లో నిర్మించారని, 14వ శతాబ్దంలో నిర్మాణం ప్రారంభమై 17వ శతాబ్దంలో పూర్తయిందని ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. ఉదయగిరిని పాలించిన కంపరాయలు ఈ ప్రాంతంలో ఒకసారి సంచరిస్తాడు. వేట మీద జీవనం సాగించే వంటడు, మిట్టడు ఇక్కడికొచ్చిన కంపరాయలకు, ఆయన పరివారానికి శ్రీరాముడు సృష్టించిన బుగ్గనీటితో దప్పిక తీరుస్తారు. వీరిరువురి కోరికపై కంపరాయలు ఆలయాన్ని నిర్మించి ఒంటిమిట్ట గ్రామాన్ని ఏర్పాటుచేస్తాడు. క్రీ.శ 1356లో బుక్కరాయలు ఈ ఆలయాన్ని ప్రారంభించాడు.ఆ తరువాత కాలంలో విజయనగరరాజులు, మట్లిరాజులు క్రమంగా గుడికి అంతరాళం, రంగమండపం, మహాప్రాంగణం, గోపురం, రథం నిర్మించారు. ఒంటిమిట్ట చుట్టుపక్కల గ్రామాల రాబడిని ఆలయ కైంకర్యాలకు వినియోగించారు. వావిలికొలను సుబ్బారావు భిక్షాటన చేసి విరాళాలు సేకరించి ఆలయానికి పూర్వ వైభవం తెచ్చారు.

రాములవారిపై సాహిత్యం :

ఎందరో మహాకవులు తన సాహిత్యం ద్వారా శ్రీరామచంద్రుని కరుణకు పాత్రులయ్యారు. పోతన ఇక్కడే భాగవతాన్ని అనువదించినట్టు తెలుస్తోంది. అయ్యలరాజు తిప్పయ్య ఒంటిమిట్ట రఘువీర శతకం చెప్పారు. రామభద్రుడు ‘రామాభ్యుదయం’ రచించారు. నల్లకాల్వ అయ్యప్ప ఒంటిమిట్ట రాముని వరం పొంది వరకవి అయ్యారు. ఉప్పు గొండూరు వేంకటకవి ఒంటిమిట్ట రశరథరామ శతకం చెప్పారు. వావిలికొలను సుబ్బారావు ఆంధ్రవాల్మీకి రామాయణాన్ని మందర వ్యాఖ్యతో రచించారు. తాళ్లపాక అన్నమయ్య రామునిపై పలు సంకీర్తనలు ఆలపించారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!