ANDHRA PRADESHBREAKING NEWSCRIME NEWSOFFICIALSTATE NEWS

ఫార్మాసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన

 

ఫార్మాసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన

ఆత్మహత్యకు బాధ్యుడిగా డా. దువ్వాడ దీపక్ అరెస్టు – కచ్చితమైన చట్ట చర్యలు తీసుకుంటామని హామీ

నాగాంజలి కుటుంబానికి ప్రభుత్వ భరోసా – బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలి: పవన్ కళ్యాణ్

వెంటిలేటర్‌పై 12 రోజులు పోరాడిన నాగాంజలి మృతి – స్వగ్రామానికి మృతదేహం చేరిక

విద్యార్థినుల రక్షణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది – పోలీసులకు పవన్ సూచనలు

జీలుగుమిల్లి ఏప్రిల్ 05 యువతరం న్యూస్:

ఫార్మాసిస్ట్ నాగాంజలి ఆత్మహత్య ఘటనపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పోలవరం నియోజవర్గం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఏపీ ట్రైకర్ బొరగం శ్రీనివాస్ స్పందించారు. నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరమన్నారు. బాధిత విద్యార్థిని కుటుంబానికి కూటమి ప్రభుత్వ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆత్మహత్యకు కారకుడిపై చట్ట ప్రకారం చర్యలుంటాయన్నారు. రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరమని.. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు తెలిపారు. కిమ్స్ ఆసుపత్రిలో ఇంటర్న్‌గా ఉన్న నాగాంజలి తన సూసైడ్ నోట్‌లో కారకుడిగా పేర్కొన్న ఆసుపత్రి ఏజీఎం డా.దువ్వాడ దీపక్‌ను ఇప్పటికే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలియచేశారన్నారు. కచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.విద్యార్థినులు, యువతుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు పోలీసు శాఖ కూడా మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టడంతో పాటు బాధిత వర్గం ఆవేదనను, భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తోటి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడితే విద్యార్థులు ఆందోళనకు లోనవుతారని తెలిపారు. కోల్‌కతాలోని ఆర్జీ‌కర్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న అత్యాచార, హత్య ఘటన సమయంలో మెడికోలు ఆందోళనలు చేయడాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. విద్యార్థులకు, యువతులకు భరోసా, ధైర్యం కల్పించాల్సిన బాధ్యత పోలీసులు తీసుకోవాలని సూచించారు. రాజమండ్రి ఘటన నేపథ్యంలో అనుసరించాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి హోంశాఖ మంత్రి అనిత, డీజీపీకి తెలియజేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

స్వగ్రామానికి మృతదేహం:

కిమ్స్ ఆస్పత్రిలో ఏజీఎం దీపక్ వేధింపులతో అధిక మోతాదులో మత్తుమందు తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ నాగాంజలి చికిత్స పొందుతూ మృతిచెందింది. 12 రోజుల పాటు వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడిన ఆమె.. చివరకు ఓడిపోయింది. దీంతో నాగాంజలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తి అయిన అనంతరం ఆమె స్వగ్రామం ఏలూరు జిల్లా జీలుగుమిల్లీ మండలం రౌతుగూడెం స్వగృహానికి నాగాంజలి పార్థివదేహం చేరుకుంది. అంబులెన్స్ లో మృతదేహాన్ని స్వగృహానికి చేర్చారు అధికారులు. అంజలి నివాస వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జీలుగుమిల్లీ పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తన బిడ్డ ఎలాగైనా ప్రాణాలతో తిరిగి వస్తుందను అనుకున్న తల్లిదండ్రులకు ఆమె మృతదేహం రావడంతో కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. నాగాంజలి మృతదేహాన్ని చూసేందుకు ఆమె నివాసం వద్దకు భారీగా గ్రామస్తులు చేరుకుంటున్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!