టోల్ చార్జీల భారాన్ని తగ్గించండి

టోల్ చార్జీల భారాన్ని తగ్గించండి
మంగళగిరి ప్రతినిధి మార్చి 28 యువతరం న్యూస్:
కాజ టోల్గేట్ టాటా మ్యాజిక్ లకు నెలవారి పాసులు తొలగించి, ప్రతి ట్రిప్పుకు డబ్బులు చెల్లించే విధానం ప్రవేశపెట్టి, చార్జీలు పెంచడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని శ్రీ లక్ష్మీనరసింహ టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గట్టెం నవీన్ కుమార్, నాయకులు అన్నారు. స్థానిక రాయల్ గ్యాస్ కంపెనీ రోడ్డులోని స్టాండ్ లో గురువారం నవీన్ కుమార్, నాయకులు మాట్లాడారు. నియోజకవర్గంలో సుమారు 200 కుటుంబాలు టాటా మ్యాజిక్ వాహనాలు నడుపుకుంటూ జీవనం గడుపుతున్నారన్నారు. 12 సంవత్సరాల నుంచి నెలకు 150 రూపాయలు టోల్ చార్జీలు చెల్లించే వాళ్లమన్నారు. గత ఏడాది నవంబర్ నుంచి నెలవారి విధానాన్ని రద్దు చేశారన్నారు. టోల్ ప్లాజా దాటిన ప్రతిసారి 80 రూపాయలు చెల్లించే విధానం ప్రవేశపెట్టారన్నారు. ఈఎంఐలు, ఇన్సూరెన్స్, టాక్స్ లు, వాహన రిపేర్లతోపాటు టోల్ చార్జీలు కూడా భారీగా పెంచడం వల్ల ఆర్థిక భారంతో వర్కర్ల జీవితాలు అగమ్యగోచరంగా మారాయన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ సమస్యను పరిష్కరించి, పాత విధానంలోనే టోల్ చార్జీలు వసూలు చేయాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి హనుమంతరావు, యూనియన్ నాయకులు రాము, జి శ్రీను, రామకృష్ణ, వెనిగళ్ళ సాయికుమార్, ఎన్ ఆనందకుమార్ తదితరులు పాల్గొన్నారు.