ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల పట్ల బెదిరింపు ధోరణులు మానుకోవాలి
జేఏసీ

ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల పట్ల బెదిరింపు ధోరణులు మానుకోవాలి
గ్రామపంచాయతీ కార్మిక, ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆర్. మధుసూదన్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం యువతరం ప్రతినిధి;
ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల పట్ల బెదిరింపు ధోరణులు మానుకొని వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని గ్రామపంచాయతీ కార్మిక, ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మణుగూరు మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల దీక్ష శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని, ఇతర చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు కల్పించాలని జేఏసీ ఆధ్వర్యంలో అనేకసార్లు వినతి పత్రాలు సమర్పించి, ఆందోళనలు నిర్వహించి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం వలన తప్పనిసరి పరిస్థితులలో గ్రామపంచాయతీ కార్మికులు సమ్మెకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించవలసిన ప్రభుత్వం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన చందంగా కలెక్టర్ల ద్వారా, డిపిఓల ద్వారా ఎంపీడీవోలపై, ఎం పి ఓ ల పై, కార్యదర్శులపై ఒత్తిడి తీసుకువచ్చి గ్రామపంచాయతీ కార్మికులు సమ్మెకు వెళ్లకుండా చూడవలసిన బాధ్యత మీదే, వారు సమ్మెకు వెళితే వారి స్థానంలో తాత్కాలిక కార్మికులను నియమించండి అని, లేకపోతే మీపై శాఖా పరమైన చర్యలు తీసుకోబడతాయని బెదిరించి క్రింది స్థాయి అధికారుల ద్వారా గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెను విచ్చిన్నం చేయడానికి పూనుకుంటున్నదని ఆరోపించారు. ఇది సరైనది కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బెదిరింపు ధోరణలు మానుకొని, గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై చర్చించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు బెదిరింపులకు భయపడకుండా ఐక్యంగా సమ్మెలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఐక్యంగా ఉంటే విజయం సాధిస్తామన్నారు. విడిపోతే ఓడిపోతామన్నారు.