ANDHRA PRADESHBREAKING NEWSCORRUPTIONOFFICIALSTATE NEWS

ఇది సినిమా కథ కాదు

జైలులో ఇద్దరు పోలీసులతో సహా ఇన్స్పెక్టర్ స్వర్ణలత

ఇది సినిమా కథ కాదు!

జైలులో ఇద్దరు పోలీసులతో సహా ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలత..

నోట్ల మార్పిడి కేసులో అరెస్టు..

విశాఖ యువతరం ప్రతినిధి;

నోట్లమార్పిడి కేసులో సాక్ష్యాత్తూ విశాఖలోని ఆర్మ్‌డ్‌ రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలత నిందితురాలుగా జైలుకు వెళ్లారు. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. ఏపీ పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలిగా కూడా ఉన్న స్వర్ణలత ఒక నేవీ ఉద్యోగిని బెదిరించి రూ.12లక్షలు కాజేశారంటూ పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ మొత్తం కోటి రూపాయలనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గాజువాకకు చెందిన కొల్లి శ్రీను (నేవీ ఉద్యోగి) తన వద్ద రూ.12లక్షల విలువైన 2వేల నోట్లున్నాయని, తనకు రూ.500నోట్లిస్తే 10శాతం కమీషన్‌ ఇస్తానని ప్రచారానికి దిగాడు. దీంతో తమకు 20శాతం కమీషన్‌ ఇస్తే తక్షణమే రూ.500నోట్లు ఇచ్చేస్తానని స్వర్ణలత ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీన సాయంత్రం శ్రీను సహా మరో వ్యక్తి రూ.12లక్షల నగదు తీసుకుని గురుద్వారా సమీపంలోని ఓ ప్రాంతానికి వచ్చారు. అదే సమయంలో పోలీస్‌ వాహనంలో ఆర్‌ఐ స్వర్ణలత, హోంగార్డు శ్రీను, ఏఆర్‌ కానిస్టేబుల్‌ హేమసుందర్‌తో పాటు సూరిబాబు అనే మరో వ్యక్తితో కలిసి వీళ్లు కూడా ద్వారకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న నిర్ణీత ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో వీరంతా సివిల్‌ దుస్తుల్లో ఉన్నట్టు తెలిసింది. అధికారిక వాహనాన్ని వేరే చోట నిలిపివేసి వీళ్లంతా నడుచుకుంటూనే ముందుగా అనుకున్న ప్రాంతానికి చేరారు. డబ్బు తెచ్చామని శ్రీను చెప్పడంతో తాము కూడా తెచ్చామని స్వర్ణలత వెల్లడిరచారు. అదే సమయంలో కానిస్టేబుల్‌ శ్రీను వేరే వ్యక్తికి ఫోన్‌ చేస్తూ అర్జంట్‌గా రావాలని, ఇద్దరు వ్యక్తులు అక్రమ నగదును తరలిస్తున్నారంటూ ఫోన్లో చెప్పడాన్ని కొల్లి శ్రీను గ్రహించాడు.
కానిస్టేబుల్‌, హోంగార్డు, ఆర్‌ఐ.. వీరంతా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు ఫోన్‌ చేశామని, వారంతా వచ్చి మిమ్మల్ని అరెస్టు చేస్తారని, డబ్బు స్వాధీనం చేసుకుంటారని, కేసు తప్పదని, తాము కూడా పోలీసులమేనని శ్రీనును బెదిరించారు. ఇలా మోసం చేయడం తగదని ప్రశ్నించిన శ్రీను, ఆయన స్నేహితుడి పట్ల వీరంతా దురుసుగా వ్యవహరించారు. స్టేషన్‌కు వచ్చి ఈ సొమ్ము మీకెలా వచ్చిందో ఆధారాలు చూపించి పట్టుకెళ్లొచ్చని చెప్పి గ్యాంగ్‌ రూ.12లక్షలూ పట్టుకుపోయారు.అయితే తాము మోసపోయామని గ్రహించిన శ్రీను పోలీస్‌ కమిషనర్‌ త్రివిక్ర వర్మను ఆశ్రయించారు. ఈ కేసును పరిశీలించాలని డీసీపీ`1 విద్యా సాగర్‌ నాయుడ్ని సీపీ ఆదేశించారు. నోట్ల మార్పిడి జరిగితే కమీషన్‌ ఇస్తానని శ్రీను కోరడం, అలాగేనని చెప్పి, డబ్బు తీసుకువచ్చిన తర్వాత సూరిబాబు, ఆర్‌ఐ స్వర్ణలత, హోంగార్డు శ్రీను, ఏఆర్‌ పీసీ హేమ సుందర్‌ భయపెట్టడం, అడ్డగించడం, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వస్తారని బెదిరించడం, డబ్బు లాక్కోవడం వంటి అంశాలపై ద్వారకా పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి క్రైం నంబర్‌ 61/2023 పేరిట ఐపీసీ 386, 341, 506, రెడ్‌ విత్‌ 34ఐపీసీ సెక్షన్లు నమోదు చేశారు. వీరందర్నీ శుక్రవారం కూడా డీసీపీ నాయుడు ఎంవీపీ పీఎస్‌లో విచారించారు. నేడో, రేపో నిందితుల్ని రిమాండ్‌కు తరలిస్తారని పోలీసులు చెబుతున్నారు. సూరిబాబును ఏ`1గా, హోంగార్డు శ్రీనును ఏ`2గా, ఏఆర్‌పీసీ హేమ సుందర్‌ను ఏ`3గా, ఆర్‌ఐ స్వర్ణలతను ఏ`4గాను ఎఫ్‌ఐఆర్‌లో చూపించారు.

అసలు కథేంటో…..?????

పోలీసులు చెబుతున్నది ఈ విధంగా ఉంటే..అసలు కథ మరోలా ఉందని తెలిసింది. నగరంలోని పేరు మోసిన రాజకీయ నేత, బిల్డర్‌ ఒకరు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను తక్షణమే మార్పిస్తే 10శాతం కమీషన్‌ ఇస్తానని తనకు తెలిసిన వాళ్లతో చెబుతున్నట్టు తెలిసింది. దీంతో ఆర్‌ఐ స్వర్ణలత కూడా తమకు తెలిసిన వారితో పని చేయిస్తానని, 20శాతం కమీషన్‌ ఇవ్వాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. నాలుగు రోజుల క్రితం రూ.1కోటి విలువైన రూ.2వేల నోట్లను తీసుకురాగా, మధ్యవర్తులు, ఇతర వ్యక్తుల సమక్షంలో రూ.500నోట్లను ఇప్పించాల్సి ఉంది. తన కమీషన్‌ కింద రూ.20లక్షలు తీసుకుని, మిగతా మొత్తాన్ని రూ.500నోట్లలో తిరిగిచ్చేయాల్సిన సమయంలో గొడవ జరిగి ఇదంతా చోటు చేసుకుందని తెలిసింది. పెద్దల వ్యవహారం కావడంతో కేవలం రూ.12లక్షల్నే చూపించారని, అమరావతి నుంచి వైసీపీ పెద్దలు కూడా ఫోన్లు చేసి కేసును చిన్నదిగా చూపించాలని నగర పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. *అయితే విషయం బయటకు పొక్కడంతో తమపై అనుమానాలొస్తాయని పేర్కొనడంతోనే ఆర్‌ఐ స్వర్ణలతను ఏ`4గా పోలీసులు చూపించారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తనకు సినిమాల్లో ఛాన్స్‌ ఇప్పిస్తానని సదరు ప్రజాప్రతినిధి చెప్పడంతోనే ఈ వ్యవహారంలో తల దూర్చాల్సి వచ్చిందని స్వర్ణలత తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!