విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలి
వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలి
కొత్తపల్లి యువతరం విలేఖరి;
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు సరైన విద్య అందడం లేదు ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ మండల నాయకులు ఎన్ స్వాములు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కే దినేష్ కుమార్, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు బొల్లు ప్రసాద్ బాబు యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం నాడు ఎర్రమఠం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తపల్లి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఇద్దరు ముగ్గురుఉపాధ్యాయులతోనే విద్యనుఅందించడం జరుగుతుంది అని తెలిపారు. సింగరాజు పల్లె ప్రాథమిక పాఠశాలలో 74 మంది పిల్లలు ఉంటే కేవలం ఇద్దరు టీచర్లను మాత్రమే ఏర్పాటు చేశారన్నారు. ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ను నియమించాలని నిబంధనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అమలు చేయడం లేదు అని తెలిపారు. కొక్కెరంచ ప్రాథమికోన్నత పాఠశాలలో 179 మంది విద్యార్థులు ఉంటే కేవలం ముగ్గురు ఎస్జిటి టీచర్లు మాత్రమే విద్యానందిస్తున్నారు అని పేర్కొన్నారు. ఎర్రమఠం ప్రాథమికోన్నత పాఠశాలలో 105 మంది విద్యార్థులు ఉంటే కేవలం ముగ్గురు ఎస్జీటీలు మాత్రమే ఉన్నారు అని తెలిపారు. ఎదురుపాడు గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో 98 మంది విద్యార్థులకు ఐదు మంది ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట కేవలం ముగ్గురు ఎస్జిటి టీచర్లు మాత్రమే ఉన్నారన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో సబ్జెక్టుల వారిగా ఒక్కొక్క పాఠశాలకు కనీసం 8 నుంచి 10 మంది ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట సబ్జెక్టు టీచర్లను నియమించకుండా ప్రభుత్వం కేవలం ఇద్దరు ముగ్గురు ఎస్జీటీ టీచర్లతోనే పాఠశాలలను నడిపితే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ఏ విధంగా అందుతుందని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలలో నియమించాలని, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సబ్జెక్టుల వారిగా స్కూల్ అసిస్టెంట్ టీచర్లతో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.