అంధులకు బాసటగా బీసీ రాజారెడ్డి
సొంత నిధులతో ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ

అంధులకు బాసటగా బిసి రాజారెడ్డి
సొంత నిధులతో ప్రతినెలా ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ
160 మందికి రూ.500 చొప్పున రూ 80000 పంపిణీ
ఈ నెల నుండి మరో ఇద్దరు అంధులకు కొత్తగా పెన్షన్
బనగానపల్లి యువతరం విలేఖరి;
బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి ప్రతినెలా సొంత డబ్బులతో అంధులకు పెన్షన్లు పంపిణీ చేస్తూ వారికి బాసటగా నిలుస్తున్నారు. తన తండ్రి కీర్తిశేషులు బిసి గురెడ్డి జ్ఞాపకార్థం 14 ఏళ్ల క్రితం అంధులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని బిసి రాజారెడ్డి తెలిపారు. అప్పటి నుండి నేటి వరకు ప్రతినెలా 1వ తేదీనే క్రమం తప్పకుండా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈనెల కొత్తగా ఇద్దరు అంధులకు పెన్షన్లు మంజూరు చేశామన్నారు. శనివారం మెత్తం 162 మంది అందులకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున రూ. 81000 పంపిణీ చేయడం జరిగిందని బిసి రాజారెడ్డి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు . ఒక్క బనగానపల్లె నియోజకవర్గం కాకుండా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి వంద శాతం అంధత్వం ఉండి తనను సంప్రదించిన వారందరికీ పింఛన్లు మంజూరు చేశామన్నారు. దూరప్రాంతాల్లో ఉండి బనగానపల్లెకు రాలేని వారికి మనియార్డర్ ద్వారా పింఛన్ డబ్బులు పంపిస్తున్నామన్నారు. నేటి సమాజంలో అంధులను ప్రోత్సహిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. అంధత్వం శరీరానికే కానీ మనసుకు కాదన్నారు . అంధులు కంటితో చూడలేకపోయినా మనసుతో గ్రహించుకునే శక్తి సామర్థ్యాలు సంపూర్ణంగా ఉంటాయన్నారు. ప్రతిఒక్కరూ అంధులను చిన్నచూపు చూడకుండా వారికి అండగా నిలిచి చేయూతనివ్వాలని కోరారు. కంటి చూపు లేదని అంధులు బాధపడకుండా మనో నేత్రంతో లోకాన్ని ఊహించుకొని జీవితాన్ని ముందుకు కొనసాగించాలన్నారు. అంధులు శారీరకంగా , మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలుగుతారని అన్నారు. అంధత్వం గురించి బాధపడకుండా మనోధైర్యంతో ఉన్నత విద్యలను అభ్యసించి మంచి స్థాయిలో నిలబడి అందరికీ ఆదర్శంగా నిలవాలని బిసి రాజారెడ్డి సూచించారు. కార్యక్రమంలో టీడీపీ యువనాయకుడు కాట్రేడ్డి మల్లికార్జునరెడ్డి, మహేశ్వరరెడ్డి, బలరామయ్య పాల్గొన్నారు.