
యదేచ్చగా అక్రమ కట్టడాలు
చోద్యం చూస్తున్న అధికారులు
వెల్దుర్తి యువతరం విలేఖరి;
కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా మండల కేంద్రమైన వెల్దుర్తి లో రామళ్లకోట రోడ్డు వైపున గల వంక ను కొందరు అక్రమార్కులు యదేచ్ఛగా ఆక్రమించుకుంటున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల పట్టణ ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజులుగా వంకలో అక్రమ కట్టడాల జోరు పెరిగింది. ఇటు రెవెన్యూ అధికారులు గానీ, అటు పంచాయతీ అధికారులు గానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం గమనించదగ్గ విషయం. పట్టణ ప్రజలు అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకొని వెళ్లిన అక్రమ కట్టడాలను నివారించడంలో అధికారులు ఎందుకు విఫలమవుతున్నారో ఆ భగవంతుడికే తెలియాలి. వంకలు ఆక్రమించుకోవడం వల్ల వర్షాకాలంలో వర్షపు నీరు వస్తే గ్రామంలోనికి నీరు వచ్చే అవకాశం ఉందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. కాలువలకు సంబంధించిన పైపులను సైతం పూడ్చివేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు, అంటే అధికారుల భయం ప్రజలకు ఏ పాటిన ఉందో అర్థమవుతుంది. అక్రమ నిర్మాణాలు నిలుపుదల చేయవలసిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కబ్జాదారుల చెర నుండి విలువైన వంక భూములను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే రాబోయే కాలంలో వంక అనేది కబ్జాకు గురై కనుమరుగు అయి పోయే అవకాశం ఉందని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు నేటికైనా నాన్చుడు ధోరణి వీడి కబ్జాదారులపై తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. సంబంధిత అధికారుల మౌనమే వంక ఆక్రమణ ఇంతవరకు వచ్చిందని పట్టణ ప్రజల ఆరోపిస్తున్నారు. అధికారుల మౌనం వెనుక అంతర్యం ఏమిటి అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేటికైనా సంబంధిత అధికారులు కల్పించుకొని వంక ఆచరణకు గురికాకుండా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉందని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు.