విశాఖ భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టిదిబ్బలపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం
జనసేన

విశాఖ భౌగోళిక వారసత్వ సంపద ఎర్ర మట్టి దిబ్బలపై
వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యం
పరిరక్షించాల్సిన విఎమ్ఆర్డిఏ
పడగొట్టే బుల్డోజర్ గా తయారైన వైనం
ప్రకృతిని పరిరక్షించుకోవాలి
అందుకోసం విశాఖలో ప్రతి పౌరుడు అడుగువేయాలి
పర్యావరణ ఆంధ్ర ప్రదేశ్
జనసేన నినాదం
చారిత్రాత్మక వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బల్లో భూ సమీకరణ ను నిలిపివేయాలి
జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్
విశాఖ యువతరం ప్రతినిధి;
ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా పేరొందిన ఎర్రమట్టి దిబ్బల ఉనికిని, ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా విశాఖపట్నం పట్టణ అభివృద్ధి సంస్థ ( వీ ఎం ఆర్ డీ ఏ ) ద్వారా భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేయడం చట్ట విరుద్ధం. దేశ విదేశీ పర్యాటకులను, సినీ నిర్మాతలను ఆకర్షిస్తున్న వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఎర్రమట్టి దిబ్బలలో లే అవుట్ లు వేయడం వల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకప్పుడు 1500 ఎకరాల్లో విస్తరించి ఈ దిబ్బలు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం అసమర్ధ విధానాల కారణంగా 80 ఎకరాలకే పరిమితమయ్యాయి. వాటిని కాపాడి పర్యాటకపరంగా అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ధ్వంసం చేసే ప్రయత్నం చేయటం బాధాకరం. భోగాపురం విమానాశ్రయానికి ఎర్రమట్టి దిబ్బల పక్కనుంచి వెళ్లే రహదారిని ఎర్రమట్టి దిబ్బల ప్రాధాన్యత దృష్ట్యా కుదించిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఏకంగా లేఅవుట్ వేసేందుకు ముందుకు రావడం పలు అనుమానాలకు కారణం అవుతుంది. వారసత్వ స్థలాలను పరిరక్షించి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించాల్సిన పాలకులు అందుకు విరుద్ధంగా వాటిని ధ్వంసం చేయటం క్షమించరాని నేరం. జే. వీ.అగ్రహారం, నేరళ్ళ వలస, నిడిగట్టు, చిప్పాడ, తాళ్ళవలస, దాకమర్రి తదితర గ్రామాల్లో భూ సమీకరణకు ఇచ్చిన నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. ఇది చట్ట విరుద్ధం. వాల్టా చట్టానికి కేంద్ర చట్టాలకు ఈ భూ సమీకరణ పూర్తిగా విరుద్ధంగా ఉంది., ఐఎన్ఎస్ కళింగ దేశభద్రతాపరంగా అత్యంత కీలకమైన ప్రాంతం. దాని పక్కనే లే అవుట్ వేయటం దేశభద్రతకు ప్రమాదమే అవుతుంది.
పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా గతంలో చేపట్టిన భూ సమీకరణ లన్ని అక్రమాలు, అవినీతికి చిరునామాగా మారాయి. 15 ఏళ్ల క్రితం వేసిన పరదేశీ పాలెం ఓజోన్ వ్యాలీ అతీగతీ లేకుండా పడి ఉంది. ఇందులో వందల కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలు జరిగాయని గతంలో వుడా వీసీగా పనిచేసిన కోన శశిధర్ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. దానిపై ఇప్పటికి చర్యలు లేవు. ఓజోన్ వ్యాలీని అభివృద్ధి చేయలేదు. కొందరు వ్యక్తుల స్వార్థం కోసం ముదపాకలో ప్రారంభించిన భూ సమీకరణ పలు వివాదాలతో హైకోర్టు విచారణలో ఉంది. ఈ భూ సమీకరణ కారణంగా కిందిస్థాయి సర్వే అధికారులు రెవెన్యూ అధికారులు క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. విశాఖపట్నం పట్టణ అభివృద్ధి సంస్థకు భూ సమీకరణ కలిసి రాలేదు. అధికారంలో ఉన్న కొందరు పెద్దలు, పైరవికార్ల స్వార్థం కోసం వుడా ద్వారా భూ సమీకరణ జరిపిస్తున్నట్టు మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. వాస్తవాలను పరిశీలించి ఎర్రమట్టి దిబ్బల పరిసర ప్రాంతాల్లో చేపట్టిన భూ సమీకరణను తక్షణమే నిలిపివేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎర్రమట్టి దిబ్బలు ప్రాంతం మొత్తాన్ని వారసత్వ సంపద గా గుర్తించి భవిష్యత్తులో అక్కడ ఎటువంటి విధ్వంసాలు జరగకుండా కట్టుదట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికే ఋషికొండ, ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటి ప్రాంతాల్లో వేలాది చెట్లు నరికేసి ప్రకృతి విద్వాంసానికి పాల్పడిన ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సంబంధిత అధికారులు ఇప్పటికే హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఎర్రమట్టిదిబ్బల జోలికి వెళ్లి మరో మారు అటువంటి తప్పు చేయవద్దని కోరుతున్నాం.