గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించండి

రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సిద్ధంగా వుంచండి
-గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించండి
-జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్
నంద్యాల ప్రతినిధి, జూన్ 13, (యువతరం న్యూస్) :
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ వ్యవసాయ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు తమ పరిధిలోని సాగయ్యే విస్తీర్ణానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉంచుకోవాలని వ్యవసాయ సిబ్బందిని ఆదేశించారు. పెద్ద కొట్టాల రైతు భరోసా కేంద్రంలోని కియోస్కి మెషీన్ ను, మాయిశ్చర్ మీటర్ ను,ఎరువులు భద్రపరచిన గోడౌన్ ను కలెక్టర్ పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని వివిధ రికార్డులను తనిఖీ చేస్తూ అందుబాటులో వున్న ఎరువులు, విత్తనాల స్టాక్ ను కలెక్టర్ పరిశీలించారు. ఇప్పుడిప్పుడే రైతులు పొలాల్లో సేద్యం పనులు మొదలు పెట్టారని సాగుకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వ్యవసాయ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.అనంతరం నంద్యాల పట్టణం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని తిక్కస్వామి దర్గా-1అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు.గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లలకు అందుతున్న పౌష్ఠికాహార పంపిణీ సంబంధిత వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.పిల్లల బరువు ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. హాజరుపట్టిక, పిల్లల బరువు, ఎత్తు రిజిస్టర్, పౌష్ఠికాహార పదార్థాలు, మందులు, తదితర రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం నిర్ధేశించిన మెనూ ప్రకారం క్రమం తప్పకుండా గర్భిణీ స్త్రీలు చంటి పిల్లలకు పోషకాహార పదార్థాలు అందివ్వాలని కలెక్టర్ అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. రక్తహీనత గల గర్భిణీ స్త్రీలకు ఐరన్ ఫోలిక్ టాబ్లెట్లు, పోషకాహార పదార్థాల కిట్టును సరఫరా చేయాలన్నారు. వీలైతే అంగన్వాడీ కేంద్రంలోనే పోషకాహార పదార్థాలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ నిర్మల కలెక్టర్ వెంట ఉన్నారు